ఉసురుతీసే కాలేజీలపై వేటు - MicTv.in - Telugu News
mictv telugu

ఉసురుతీసే కాలేజీలపై వేటు

October 16, 2017

నియమ నిబంధనలు పాటించకుండా, చదువు పేరుతో విద్యార్థులను హింసకు గురిచేసే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యామంత్రి కడియం శ్రీహరి హెచ్చరించారు. నారాయణ, చైతన్య తదితర కాలేజీల్లో విద్యార్థులు మానసిక ఒత్తిళ్లతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయన సోమవారం విద్యాశాఖ, సంబంధిత విభాగాల అధికారులతో సమావేశమై పరిస్థితి సమీక్షించారు. కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో ఆత్మహత్యలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చాలా కాలేజీల్లో ర్యాంకుల కోసం విద్యార్థులను వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి చెప్పారు.

‘సెలవుల్లోనూ విద్యార్థులను చూడ్డానికి తల్లిదండ్రులను కాలేజీలు అనుమతించడం లేదు. కాలేజీల నిర్వహణ, విద్యార్థుల పరీక్షలు తదితరాలకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని యాజమాన్యాలకు గట్టిగా చెబుతున్నాం.. వాటిని పాటించకపోతే గుర్తింపును రద్దు చేస్తాం. ఒత్తిడి ఎదుర్కొంటున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి సెంటర్లను ఏర్పాటు చేయండి. కాలేజీల్లో వారం పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నివేదికలు తీసుకుంటాం…’ అని మంత్రి చెప్పారు. ప్రతి ఆత్మహత్యపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. నిబంధనలు పాటించని కాలేజీలకు నోటీసులు ఇచ్చామని, కొందరు వాటిపై కోర్టులకు వెళ్తున్నారని శ్రీహరి చెప్పారు. రేపు.. అంటే అక్టోబర్ 17న కాలేజీల యాజమాన్యాలు, పేరెంట్స్ అసోసియేషన్లతో సమావేశం అవుతానని ఆయన వెల్లడించారు.