ప్రతిపక్షాలకు మంత్రి పదవులు.. ఆఫరిచ్చిన అధ్యక్షుడు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రతిపక్షాలకు మంత్రి పదవులు.. ఆఫరిచ్చిన అధ్యక్షుడు

April 4, 2022

04

తీవ్ర ఆర్ధిక, ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకలో ఆదివారం కేబినెట్ మంత్రులందరూ రాజీనామా చేశారు. ప్రజాగ్రహానికి తలొగ్గి వారు పదవుల నుంచి దిగిపోయారు. వారితో పాటు, ఆ దేశ కేంద్ర బ్యాంకు గవర్నర్ కూడా తాజాగా పదవికి రాజీనామా చేశారు. మంత్రులందరూ రాజీనామా చేసినా, ఆ దేశ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష మాత్రం అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంల రాజపక్ష సోమవారం ప్రతిపక్షాలకు ఓ లేఖ రాశారు. అందులో ‘ కోవిడ్ పరిస్థితులు, ఆర్థిక కారణాల వల్ల దేశంలో సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి మనందరం కలిసి పని చేద్దాం. దేశ ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వంలో చేరండి. కేబినెట్‌లోకి చేరి మంత్రి పదవులు చేపట్టండి’ అని పేర్కొన్నారు. సోమవారం కొత్త మంత్రి వర్గం కొలువుదీరుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగా, మంత్రుల మూకుమ్మడి రాజీనామాతో ఆ దేశ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. దీంతో ట్రేడింగును నిలిపివేశారు. ఇప్పటికే ఆ దేశంలో 36 గంటల పాటు కర్ఫ్యూ విధించగా.. ప్రజాగ్రహం ఉద్యమంగా మారకుండా ఉండేందుకు సామాజిక మాధ్యమాలను కూడా నిషేధించారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.