నీట్లో మొసలితో పోరాడి గెలిచిన మైనర్ బాలుడు - MicTv.in - Telugu News
mictv telugu

నీట్లో మొసలితో పోరాడి గెలిచిన మైనర్ బాలుడు

May 31, 2022

నీళ్లల్లో అత్యంత బలంగా ఉండే మొసలి నోటికి చిక్కినా కూడా ఓ బాలుడు ధైర్యంగా పోరాడి, ప్రాణాలతో బయటపడ్డాడు. ఒడిషాలో జరిగిన ఈ అరుదైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్రపడా జిల్లా నేషనల్ పార్క్ సమీపంలో భితర్ కనికా అనే నది ఉంది. సమీపంలోని అరజా గ్రామానికి చెందిన కొందరు కుర్రాళ్లు సరదాగా నదిలో ఈత కొడదామని ఒడ్డుదాకా వెళ్లారు. అందులో పద్నాలుగేళ్ల మైనర్ బాలుడు ఓం ప్రకాశ్ సాహోను ఆరడుగుల మొసలి ఉన్నట్టుండి నీళ్లలోకి లాక్కెళ్లింది. నడుము వరకు నీటిలో మునిగిపోయిన సాహో మొదట ప్రాణ భయంతో కేకలు వేశాడు. ఒడ్డుపై ఉన్న మిగతా పిల్లల కేకలు విని చుట్టుపక్కల ఉన్నవారు నది వద్దకు చేరుకోగా, అప్పటికే సాహోను మొసలి తన నోట్లో బంధించింది. కొందరు ఒడ్డుపై నుంచి మొసలిపై రాళ్లు విసరగా, సాహో ధైర్యం చేసి మొసలి తలపై పిడిగుద్దులు గుద్దాడు. అంతేకాక, తన చేతి వేళ్లతో మొసలి కళ్లను కుళ్ల పొడిచాడు. దాంతో నొప్పి తాళలేక మొసలి సాహోను వదిలేసి పారిపోయింది. దీంతో ఒడ్డుకు చేరుకున్న కుర్రాడి చేతికి, కాలికి గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. కాగా, నది ఉధృుతంగా ప్రవహిస్తుండడంతో నదిలోని మొసళ్లు ఒడ్డుకు చేరుకొని ఇలా ప్రజలమీద దాడులు చేస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఇందుకు నిదర్శనంగా నెల వ్యవధిలో ముగ్గురు చనిపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు.