కప్పలు, పిల్లులు, ఎలుకలు ముంగిసలు.. ఏదైనాసరే తిని అరాయించుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. చైనాలోనే కాదు మనదేశంలోనూ కొన్ని తెగలు, నిరుపేదలు వీటిని తింటుంటారు. కానీ కొన్నిసార్లు విషాదాలు కూడా జరగుతుంటాయి. ఇంట్లోకి వచ్చిన కప్పను కోసుకుని తిన్న కుటుంబంలో ఒక బాలిక చనిపోగా, మరో బాలిక ఆస్పత్రిపాలైంది. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
బోడా బ్లాక్‌కు చెందిన మున్నాముండా అనే గిరిజనుడి ఇంట్లోకి ఓ కప్ప వచ్చింది. మున్నా దాన్ని కూర చేశాడు. ఇంట్లో అందరూ తిన్నారు. మున్నా కూతురు ఆరేళ్ల సుమిత్ర ఆ కూరతో అనారోగ్యంబారినపడి చనిపోయింది. మరో కూతురు నాలుగేళ్ల మున్నీ తీవ్ర అస్వస్థతకు గురికాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కప్ప కూర తిన్న పెద్దలకు ఏమీ కాలేదు. పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువ కావడం దుష్ప్రభావం చూపిందని అధికారులు చెప్పారు. కొన్ని రకాల కప్పల్లో శత్రువుల నుంచి రక్షించుకోడానికి విషం ఉంటుందని మున్నా కుటుంబం అలాంటి కప్పనే వండుకుని ఉంటుందని చెబుతున్నారు. కప్పల చర్మపై విషగ్రంధులు ఉంటాయని గిరిజనులు జాగ్రత్తగా ఉండాలని వీఎస్‌ఎస్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ సంజీబ్ మిశ్రా తెలిపారు.