మైనర్ బాలికకు దేవునితో పెళ్లి.. బట్టలు పెట్టిన వైవీ సుబ్బారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

మైనర్ బాలికకు దేవునితో పెళ్లి.. బట్టలు పెట్టిన వైవీ సుబ్బారెడ్డి

May 19, 2022

టైటిల్ చూడగానే ఇదేదో జోగినీ వ్యవస్థలో భాగంగా జరుగుతుందనుకునేరు. అదికాదు. ఇలా బాలికకు దేవునితో పెళ్లి చేయడం వలన సదరు బాలికకు పెళ్లీడు రాగానే మంచి వరుడు భర్తగా లభిస్తాడని వారి నమ్మకం. అనంతపురం రాయదుర్గంలో కొన్ని దశాబ్దాలుగా ఈ వింత ఆచారం కొనసాగుతోంది. సాంప్రదాయం ప్రకారం శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారికి బాలికతో పెళ్లి చేయడం ఏటా తప్పనిసరి. పద్మశాలి వంశం నుంచి అరవ తెగకు చెందిన బాలికను దేవునికి ఇచ్చి ఈ సారి కూడా వివాహం జరిపించారు. దేవుని విగ్రహం ముందు బాలికను కూర్చోబెట్టి బాజాభజంత్రీలతో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది ఉత్సవాలలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఆయన రాకకోసం మూడు గంటలు వేచి చూడగా, ఆయన మధ్యాహ్నం రెండున్నర గంటలకు రావడంతో అప్పుడే కల్యాణం జరిపించారు. టీటీడీ తరపున సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కాగా, అనంతపురం ఎంపీ, విప్ కాపు రామచంద్రారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.