మోదీ ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతా.. అనుమతినివ్వండి : మైనార్టీ మహిళా నేత - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతా.. అనుమతినివ్వండి : మైనార్టీ మహిళా నేత

April 25, 2022

మహారాష్ట్రలో ప్రారంభమైన హనుమాన్ చాలీసా పఠనం వివాదం ఇప్పుడు ప్రధాని మోదీ వరకు వెళ్లింది. ఆయన ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదవడానికి అనుమతినివ్వాలంటూ ఎన్సీపీకి చెందిన మైనార్టీ మహిళా నేత ఫహ్మిదా హసన్ ఖాన్ కేంద్ర హోం శాఖకు దరఖాస్తు చేశారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసం ముందు హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా, నమాజ్, నమోకర్ మంత్రం (జైన్ శ్లోకం), గురు గ్రంథ్ సాహిబ్ (సిక్కు గ్రంథం) చదివేందుకు అనుమతినివ్వాలని దరఖాస్తులో పేర్కొన్నారు. తాను తన ఇంట్లో నమాజ్‌తో పాటు దుర్గా పూజ కూడా చేస్తానని ఆమె వెల్లడించారు. కాగా, ఈ లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నివాసం మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానని మాజీ టాలీవుడ్ సినీ నటి, స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ ఇటీవల బహిరంగంగా సవాలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శివసేన కార్యకర్తలు ఆగ్రహించి ఆమె ఇంటి ముట్టడికి ప్రయత్నించగా, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఎంపీ చర్యలు ఉన్నాయంటూ నవనీత్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు వారికి మే 6 వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం నవనీత్ దంపతులు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు వ్యతిరేకంగా పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాల్సిందిగా వారు కోరారు.