5వేల కరోనా మందు 20వేలకు విక్రయం.. మెడికల్ షాపు ఓనర్ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

5వేల కరోనా మందు 20వేలకు విక్రయం.. మెడికల్ షాపు ఓనర్ అరెస్ట్

July 12, 2020

Drug

కరోనాకు యాంటీ వైరల్ డ్రగ్‌గా పనిచేసే రెమ్డిసివిర్‌ను అధిక ధరకు విక్రయిస్తున్న ఓ మెడికల్ షాప్ ఓనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని మీరా రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల సోనూ దర్శి అనే వ్యక్తి తనవద్ద రోడ్రిగ్స్ రౌల్(31) అనే వ్యక్తిని సహాయకుడిగా పెట్టుకుని మెడికల్ షాపు నడిపిస్తున్నాడు. అయితే కరోనా మందు రెమ్డిసివిర్‌ను అధిక ధరకు అమ్మాలని కక్కుర్తి పడి, దానిని అమ్ముతూ పట్టుబడ్డాడు. ఈ ఇంజక్షన్ అసలు ధర రూ.5,400 ఉండగా, అతను మాత్రం రూ.20,000లకు విక్రయించాడు. అతను నాలుగు వయల్స్ అమ్ముతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో ఈ డ్రగ్‌ను ఫార్మా కంపెనీలు నేరుగా ఆసుపత్రులకే సప్లయ్ చేస్తున్నాయి. 

అయినా ఈ మెడికల్ షాప్ యజమానికి ఆ మందులు ఎలా అందుబాటులోకి వచ్చాయో, ఈ బ్లాక్ మార్కెట్ వెనుక ఉన్నది ఎవరో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కాగా, ఎవరైనా మందుల షాపులో రెమ్డిసివిర్, టోసిలిజ్యూమాబ్ కొనాలంటే ఇకపై తప్పనిసరిగా రోగి కరోనా రిపోర్ట్ చూపించాలని మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా రిపోర్టుతో పాటు రోగి ఇచ్చిన కన్సెంట్ ఫారమ్, ఆధార్ కార్డు, డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ (మందుల చీటీ) కూడా రెమ్డిసివిర్ కొనేందుకు తప్పనిసరిగా చూపించాలని సూచించింది. ఈ నాలుగూ లేకుండా కరోనా ఔషధం కొనుగోలు సాధ్యం కాదని స్పష్టంచేసింది.