miranda faces rs 19 lakh fine after painting her doors pink in scotland
mictv telugu

ఇంటి తలుపులకు గులాబీ రంగు పెయింట్.. రూ. 19 లక్షల ఫైన్

November 1, 2022

miranda faces rs 19 lakh fine after painting her doors pink in scotland

వైవిధ్యంతో కూడుకున్న ఈ భూ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి. అలాగే చిత్ర విచిత్ర నిబంధనలు కూడా ఉన్నాయి. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఏం చేసినా, ఎలా చేసినా చెల్లుతుంది కానీ, అభివృద్ధి చెందాయనుకున్న దేశాల్లో మాత్రం ఇప్పటికీ ఆశ్చర్యపోయే రూల్స్ ఉన్నాయి. వాటి గురించి విన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి ఘటనే మనలను పాలించిన బ్రిటన్ దేశంలో జరిగింది.

కేవలం తలుపులకు గులాబీ కలర్ పెయింట్ వేయించినందుకు భారీ జరిమానాను ఎదుర్కొంది. వివరాల్లోకెళితే.. ఎడిన్ బర్గ్‌ నగరంలో నివాసముండే మిరాండా డిక్సన్ అనే మహిళ తన పూర్వీకుల నుంచి వచ్చిన ఇంటికి రెండేళ్ల పాటు మరమ్మత్తులు చేయించింది. ఫినిషింగ్ టచ్‌గా తలుపులకు గులాబీ రంగును వేయించింది. అదే ఆమె చేసిన తప్పు. ఎందుకంటే అక్కడ ఆ రంగు వేయించడం నిబంధనలకు విరుద్ధం. అందులో భాగంగా అక్కడి కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పి గులాబీ రంగుకు బదులు తెలుపు రంగును వేయాలని సూచించగా, మిరాండా ససేమిరా అంది. తన ఇంటికి గులాబీ రంగు చాలా బాగా నప్పిందని, స్థానికులు కూడా తలుపుల వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అందరి తలుపులు ముదురు రంగులో ఉంటే నా తలుపులు మాత్రం భిన్నంగా ఉండి అందరినీ ఆకర్షిస్తున్నాయని అంటోంది. అయినా కౌన్సిలర్లు వినకుండా కచ్చితంగా తెలుపు రంగు వేయాలని, లేకుంటే రూ.19 లక్షల జరిమానా చెల్లించాలని తెగేసి చెప్పారు. అందుకు కొంత గడువు కూడా విధించారు. మరి మిరాండా రంగు మార్చుకుంటుందా? లేక జరిమానా చెల్లిస్తుందా అనేది వేచి చూడాలి.