రైలు పట్టాలపై ఇనుప రాడ్.. తప్పిన పెను ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

రైలు పట్టాలపై ఇనుప రాడ్.. తప్పిన పెను ప్రమాదం

November 1, 2022

Miscreants tied iron rods to the tracks, Sabari Express is a near miss

గుర్తు తెలియని దుండగులు రైలు పట్టాలపై ఇనుప రాడ్డు ఉంచి దారుణ యత్నానికి పాల్పడ్డారు. వారు చేసిన దుర్మార్గపు పనిని ముందే గుర్తించడంతో సికింద్రాబాద్‌ నుంచి వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో శబరి ఎక్స్‌ప్రెస్ వస్తున్న రైలు మార్గంలో నల్లపాడు-గుంటూరు సెక్షన్‌ మధ్య రైలు పట్టాలపై ఇనుపరాడ్డు కనిపించింది. అది చూసి వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్‌ మంజునాథ్‌.. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రైలును ఆపివేశాడు. ఇంజినీరింగ్‌ సిబ్బంది, సహాయ లోకోపైలెట్‌లు వెళ్లి ఆ రాడ్డును తొలగించిన అనంతరం రైలు గుంటూరు స్టేషన్‌కు చేరింది.

Miscreants tied iron rods to the tracks, Sabari Express is a near miss

లోకో పైలట్ వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పిందని, లేదంటే ఆ రాడ్డు విరిగి లోకో అడుగు భాగాన తగిలి మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. దుండగులు పథకం ప్రకారమే రైలు పట్టాలపై ఇనుపరాడ్డును ఉంచినట్లు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. రాడ్డును గుడ్డతో కట్టడంతో పాటు సిగ్నలింగ్‌ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అడ్డుగా అట్టముక్కలు పెట్టడం గమనార్హం. రైలు పట్టాలపై సిబ్బంది గస్తీ నిర్వహిస్తూ ఇటువంటి వాటిని గుర్తిస్తుంటారు. వారు ఆ మార్గాన తనిఖీ చేసుకుంటూ వెళ్లిన తర్వాత దీన్ని అమర్చి ఉండొచ్చని భావిస్తున్నారు.