ఫేక్ వీడియో.. యాంకర్ అరెస్ట్‌కు రెండు రాష్ట్రాల పోలీసులు పోటీ - MicTv.in - Telugu News
mictv telugu

ఫేక్ వీడియో.. యాంకర్ అరెస్ట్‌కు రెండు రాష్ట్రాల పోలీసులు పోటీ

July 5, 2022

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చెందిన వీడియోను టీవీలో త‌ప్పుడు రీతిలో ప్లే చేసిన కేసులో ప్రముఖ టీవీ న్యూస్‌ యాంకర్‌ అరెస్ట్.. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. జీ టీవీ ఛానల్ లో డీఎన్ఏ షోకి వ్యాఖ్యాతగా వ్యవరిస్తున్న రోహిత్ రంజన్.. రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక వీడియో న్యూస్ ను తప్పుగా రిపోర్ట్ చేశాడు. ఆ తర్వాత ఛానల్ వెంటనే దాన్ని సరి చేసుకుని క్షమాపణలు కూడా చెప్పింది. అయితే దీనిపై ఛత్తీస్‌గఢ్‌లో కేసు నమోదైంది. దీంతో అతడిని అరెస్టు చేసేందుకు రాయ్‌పుర్‌ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌ వెళ్లారు. అయితే వారికంటే ముందే ఘజియాబాద్ పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్టు చేసి తమతోపాటు తీసుకువెళ్లారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే నాటకీయ పరిణామాల మధ్య అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇటీవల కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలోని రాహుల్ ఆఫీస్ పై కొందరు యువకులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘ‌ట‌న‌ను ఖండిస్తూ రాహుల్ గాంధీ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇలా చేసిన యువకులు చాలా బాధ్యతారహితం ప్రవర్తించారని… అయినా వారు చిన్న పిల్లలని, పిల్ల‌ల్ని క్షమించి వ‌దిలి పెట్టాల‌ని రాహుల్ ఆ వీడియోలో అన్నారు. అయితే ఈ వీడియోను జీ న్యూస్ త‌ప్పుగా చూపించింది. రాహుల్‌ గాంధీ వయనాడ్ లో తన ఆఫీస్ పై జరిగిన దాడి గురించి వీడియో రిలీజ్ చేయగా..దాన్ని ఉదయ్ పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ ని ముస్లిం యువకులు హత్య చేసిన ఘటనకి లింక్ చేస్తూ వీడియోను టీవీలో ప్లే చేశారు. ఉద‌య్‌పూర్ నిందుతులని వ‌దిలిపెట్టాల‌ని రాహుల్ చెప్పినట్లు ఉద్దేశం వ‌చ్చేలా రాహుల్ వ్యాఖ్యలను వక్రీకరించి రాహుల్ వీడియోను ప్లే చేశారు.

ఈ నకిలీ వీడియో వ్యవహారానికి సంబంధించి ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు బీజేపీ ఎంపీలపై కేసు నమోదైంది. రాహుల్‌ వీడియోను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి వినియోగించారని, దేశంలో మత విద్వేషాలకు పాల్పడ్డారని కాంగ్రెస్‌ ఆరోపించింది. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌ సహా ఎంపీలు సుబ్రత్‌ పాఠక్‌, భోలాసింగ్‌లపై ఛత్తీస్‌గడ్‌ సహా దిల్లీ, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కేసులు పెట్టింది.