మతిస్థిమితం లేక గ్రామంలో తిరుగుతూ ఉండే వ్యక్తి.. మూడు నెలల క్రితం అదృశ్యమై చెరుకు తోటలో అస్థిపంజరంగా కనిపించాడు. దీంతో అప్పటివరకు కంటికి రెప్పలా కాపాడుకున్న కుటుంబసభ్యులు అస్థిపంజరంగా మారిన ఆ వ్యక్తిని చూసి బోరున విలపించారు.
ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలంలోని మోటాపురం గ్రామానికి చెందిన చావా సత్యనారాయణ(58) అనే వ్యక్తికి కొన్నిరోజులుగా మతి స్థిమితంగా లేదు. గ్రామంలో ఎక్కడబపడితే అక్కడ తిరిగేవాడు. గ్రామంలో ఉన్నవారంతా తెలిసిన వాళ్లే కాబట్టి అతన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చి అప్పగించేవారు. అయితే గత మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన సత్యనారాయణ ఆచూకీ కనిపించలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామంతో పాటు పక్క గ్రామాల్లో కూడా విస్తృతంగా గాలించారు. కానీ ఆచూకీ మాత్రం లభించలేదు. అయినా ఇప్పటికీ ఆచూకీ దొరుకుతుందని ఆశతో మోటాపురం పరిసర ప్రాంతాల్లో 3 నెలలుగా వెతుకుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా మతిస్థిమితం లేని వ్యక్తి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రచారం చేశారు. చివరకు గ్రమాంలోనే లిఫ్ట్ బావి వద్ద ఉన్న చెరుకుతోటలో అస్థిపంజరంగా కనిపించాడు.
ఆ తోటలో సోమవారం చెరుకు క్రషింగ్ కోసం వచ్చిన కూలీలకు దుర్వాసన రావడంతో లోపలికి వెళ్లి చూడగా అస్థిపంజరం కనిపించగా ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే ఈ విషయాన్ని ఆ తోట యజమాని, గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అనుమానంతో సత్యనారాయణ కుటుంబ సభ్యులకు సమాచారమివ్వగా ఆస్థిపంజరంపై ఉన్న దుస్తులు చూసి అతనే అని నిర్ధారించారు. కనబడకుండా పోయాడనుకున్న వ్యక్తి ఇలా అస్థిపంజరంగా మారాడని బోరున విలపించారు. పోలీసులకు సమాచారం అందించంగా.. వారు ఆ(తల లేని) అస్థిపంజరాన్ని పోస్టుమార్టం కు పంపించారు.