సినిమాల్లో నటించే తారల జీవితాలు స్క్రీన్ మీద చూపించినంత అందంగా ఉండవు. కొందరు నటీనటులు కొంచెం స్టార్ డమ్ రాగానే అదే శాశ్వతమనే భ్రమలో ఉంటారు. ఈ సమయంలోనే జీవితంపై అవగాహన లేక చేయరాని తప్పులను చేస్తుంటారు. తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతింటారు. తీరా జ్ఞానోదయం కలిగినప్పుడు ఆలోచిస్తే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఇక చేసేదేమీ లేక తీరిగ్గా బాధపడుతుంటారు.
బాలీవుడ్ నటి అను అగర్వాల్ దీనికి తాజా ఉదాహరణ. 1990లో ఆషికి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన అను.. ఆ చిత్రం బొమ్మరిల్లు లెవెల్లో హిట్ కావడంతో విపరీతమైన ఫేమ్ వచ్చి పడింది. కానీ తర్వాత చేసిన చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో అంతేవేగంగా స్టార్ డమ్ కరగడం ప్రారంభమైంది. తర్వాత 1999లో జరిగిన ఊహించని ప్రమాదం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేయగా, ఓ నెల రోజులు తన గతాన్ని మర్చిపోయి మానసికంగా కుంగిపోయింది.
యోగా, ధ్యాన ప్రక్రియల ద్వారా తిరిగి తన గతాన్ని ప్రోది చేసుకుని ప్రస్తుతం తన పేరిట ఫౌండేషన్ నెలకొల్పి యోగా క్లాసులు నిర్వహిస్తోంది. అయితే తన వ్యక్తిగత జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని అను ఈ సందర్భంగా వెల్లడించింది. సహజీవనం వల్ల జరిగిన నష్టాన్ని వివరించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ‘స్టార్ డమ్ ఉన్నప్పుడు ఓ వ్యక్తితో సహజీవనం చేశా. అతని తల్లి కూడా నన్ను అంగీకరించింది.
అయితే తను కూడా మాతో పాటే నివసించింది. ఆమె స్నేహితులు నా గురించి చెడుగా చెప్పేవారు. పత్రికల్లో నా గురించి రాసిన, వచ్చిన వార్తలను నిజమని నమ్మేవారు. దాంతో నా జీవితం తలకిందులైంది. రూమర్లను ఖండించడానికి అప్పట్లో సోషల్ మీడియా లేదు. నన్ను నేను రక్షించుకోవడానికి ఎలాంటి మార్గం లేకుండా పోయింది. దీంతో వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయా’నంటూ నిర్వేదం వ్యక్తం చేసింది అను అగర్వాల్.