టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అనేక మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది టీఎస్ఆర్టీసీ. అందుకు వీసీ సజ్జనార్ చేస్తున్న కృషే ప్రధాన కారణం. ప్రయాణికులకు వేగంగా, సౌకర్యవంతమైన సేవలను అందించడమే కాకుండా.. వారి ప్రాణాలను సైతం కాపాడతామనే తాజా సంఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ యువతి పొరపాటున టీఎస్ఆర్టీసీ బస్సులో పోగోట్టుకున్న పర్సు కారణంగా ఆమె ప్రాణాలు నిలబడ్డాయి. కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ముప్పు తప్పింది.
పూర్తి వివరాలిలా.. ఆదివారం రోజు ఓ యువతి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బస్సు ఎక్కి సికింద్రాబాద్ జేబీఎస్లో దిగింది. ప్రయాణికులందరూ బస్సు దిగిపోయాక.. బస్సులో ఓ పర్సు పడి ఉండడాన్ని కండక్టర్ రవీందర్ గమనించారు. అది ఎవరిదో తెలుసుకోవడానికి పర్సును తెరిచి చూస్తే.. అందులో రూ.403 నగదుతో పాటు ఓ లెటర్ కనిపించింది. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. అందుకే చనిపోవాలనుకుంటున్నానని ఆ లెటర్లో రాసి ఉండడం చూసి ఆయన షాక్ అయ్యాడు. వెంటనే అలర్ట్ అయిన కండక్టర్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లాడు.
ఆ పర్సులో ఉన్న ఆధార్ కార్డుతో పాటు లెటర్‌ను సజ్జనార్‌కు ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతో వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ.. ఆ యువతిని గుర్తించాలంటూ సిబ్బందిని ఆదేశించారు. ఆర్టీసీ ఎస్సై దయానంద్, మారేడ్‌పల్లి పోలీసుల సహాయంతో ఎట్టకేలకు ఆ యువతిని గురించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు. సకాలంలో స్పందించి యువతి ప్రాణాలను కాపాడిన సిబ్బందితో పాటు కండక్టర్ రవీందర్‌ను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌లు అభినందిస్తూ ట్వీట్ చేశారు.