ఆరోగ్య సేతు యాప్ రేటింగ్ 1.. డేటా మొత్తం వసూల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆరోగ్య సేతు యాప్ రేటింగ్ 1.. డేటా మొత్తం వసూల్

May 23, 2020

Arogya Setu App

కరోనా వైరస్ కంటాక్ట్ ట్రేసింగ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరోగ్యసేతు యాప్‌పై మరోసారి వివాదం చెలరేగుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటైన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఆరోగ్య సేతు యాప్‌ను రివ్యూ చేసి గతంలో 2 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇప్పుడా రేటింగ్‌న ఆ కాలేజీ 1కి తగ్గించింది. ఆ యాప్ వినియోగదారుల ఫోన్లలో అవసరానికి మించిన డేటాను సేకరిస్తున్నదని కారణం చెప్పింది. ఇది వినియోగదారులకు ఎంత మాత్రం  మంచిది కాదని వెల్లడించింది. అంతేకాదు ఈ యాప్ కరోనా వచ్చినవారు, రానివారు దగ్గర దగ్గరగా ఉంటే.. వారిలో ఎవరికి కరోనా ఉంది, ఎవరికి లేదు.. అనే విషయాన్ని ఈ యాప్ సరిగ్గా గుర్తించలేదట. ఒక భవనంలో కరోనా వచ్చిన వారు, రాని వారు ఒకే దగ్గర ఉన్నారనుకుంటే.. వారిలో ఎవరికి ఇన్‌ఫెక్షన్ ఉంది, ఎవరికి లేదు అనే విషయాన్ని ఈ యాప్ సరిగ్గా చెప్పలేకపోతుందని వారు తేల్చారు.

మరోవైపు కోవిడ్ 19 కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఫోన్లలో యూజర్లకు చెందిన డేటాను అవసరం లేకున్నా ఈ యాప్ కలెక్ట్ చేస్తుందట.  ఈ యాప్‌ను వాడుతున్నవారు ఈ విషయంపై మరోసారి ఆలోచన చేయాలని ఎంఐటీ స్పష్టంచేసింది. ఈ యాప్‌ను ప్రజలు కచ్చితంగా తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చైసుకోవాలని.. లేదంటే జరిమానాలు విధిస్తామనియ కేంద్రం చెబుతున్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం ఈ యాప్ విషయమై ప్రజలను బలవంత పెడుతుందని, మిగిలిన దేశాల్లోనూ ఈ తరహా యాప్‌లు ఉన్నా.. అక్కడ ఇలాంటి యాప్‌లను వాడాలని ప్రజలను బలవంత పెట్టడం లేదని ఎంఐటీ చెప్పింది. కాగా, ఇప్పటికే విమానాలు, రైలు ప్రయాణాల్లో ప్రయాణికులు తప్పనిసరిగా ఈ యాప్‌ను వాడాలని కేంద్రం సూచిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రయాణికులు తమకు ఇష్టం ఉంటేనే ఈ యాప్‌ను వాడాలని తరువాత పలువురు అధికారులు వివరణ ఇచ్చారు. ఈ యాప్ పై ఓ ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ యాప్‌లో ఉన్న లోపాల కారణంగా వినియోగదారుల డేటాకు ముప్పు పొంచి ఉందని చెప్పాడు. అలాగే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం ఈ యాప్ వల్ల వినియోగదారుల డేటాకు ముప్పు ఉందని చెప్పారు. అయితే కేంద్రం అవన్నీ అబద్దాలే అని కొట్టి పారేసింది.