మిథున్ కూతురి అరంగేట్రం..! - MicTv.in - Telugu News
mictv telugu

మిథున్ కూతురి అరంగేట్రం..!

August 28, 2017

బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కూతురు దిశానీ చక్రవర్తి త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. అందంగా, నాజూగ్గా వున్న ఈ అమ్మడు ఎంట్రీ మంచి సినిమాతో జరగాలని మిథున్ భావిస్తున్నాడట. దిశానీ తన లైఫ్ లో చాలా ప్రత్యేకమైన వ్యక్తి అంటాడు. తను నా లైఫ్ లోకి వచ్చాక నా సినీ కెరియర్ ఊపందుకుందని అన్నాడు చాలాసార్లు. అయితే దిశానీ తన కన్న కూతురు కాదు. పెంచుకున్న కూతురు. ఎవరో తెలియని కన్నవాళ్ళు వదులుకొని చెత్త కుప్పలో వదిలేసిపోయారు.  ఆ చెత్త కుప్పలో పసిపాప ఏడుపులు విని అప్పుడే ఆ పాపను తన చేతుల్లోకి తీస్కున్నాడు మిథున్. ఇద్దరు భార్యాభర్తలు ఇష్టంగా తమ కూతురిగా దత్తత తీసుకున్నారు.

మిథున్ దంపతులకు ముగ్గురూ కొడుకులే. వారింట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది దిశానీ. న్యూయార్క్ ఫిల్మ్ స్కూల్లో నటనకు, దర్శకత్వానికి సంబంధించి కోర్సు చేస్తోంది. మంచి బ్యానర్లో, మంచి డైరెక్టర్ తో తన కూతురు ఎంట్రీ జరగాలని భావిస్తున్నాడట మిథున్ చక్రవర్తి.  సీనియర్ నటీనటుల వారసులు ఇప్పుడు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వటం ఫ్యాషన్ గా మారిపోయింది. మన తెలుగులో చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున, బ్రహ్మానందంల వారసులు ఇప్పటికే టాలీవుడ్ లో తమ సత్తా చాటారు. వెంకటేష్, బాలకృష్ణ వారసులే మిగిలున్నారు. వాళ్ళిద్దరు కూడా తమ కొడుకులను వారసత్వపు హీరోలుగా తేవాలనే ఉద్దేశంలో వున్నట్టు సమాచారం.

అలాగే నటి శ్రీదేవి కూతుళ్ళు జాహ్నవి, ఖుషీల ఎంట్రీ కూడా త్వరలోనే వుందట. సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కూడా ఇప్పటికే ఓ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ఆల్ రెడీ హీరోయిన్ గా ప్రూవ్ చేస్కుంది. కొడుకు కూడా ‘ మిర్జ్యా ’ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. షారూఖ్ ఖాన్ కూతురు కూడా అతి త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి కూడా ‘ హీరో ’ సినిమా ద్వారా హీరోయనయింది తెల్సిన విషయమే. ఆ బాటలో మిథున్ చక్రవర్తి కూతురు దిశానీ కూడా ఎన్నో అంచనాల నడుమ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. సో.. చూడాలి దిశానీ ఏ మేరకు హీరోయిన్ గా దూసుకుపోనుందో.