మట్టి పాటల మిట్టపల్లితో ప్రేమ పాట రాయించిన శేఖర్ కమ్ముల - MicTv.in - Telugu News
mictv telugu

మట్టి పాటల మిట్టపల్లితో ప్రేమ పాట రాయించిన శేఖర్ కమ్ముల

February 15, 2021

‘నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో..’
ప్రేమలోని మాధుర్యాన్ని ముచ్చటైన పదాలతో చిత్రిక పట్టే ఈ వలపు పాట తెలుగు ప్రేక్షకులకు ప్రేమను సరికొత్తగా పరిచయం చేస్తోంది. ప్రేమికులను కట్టి పడేస్తోంది. ఎవరి ఫోన్లో విన్నా ఈ పాటే వినిస్తోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంలోని ఈ సాంగ్ లిరిక్స్ వీడియోను వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రముఖ సినీ, జానపద గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ ఈ పాట రాశారు. ప్రేమజంట మధ్య సాగే ఊసులను అద్భుతంగా పదాల్లోకి తర్జుమా చేశారు.
‘ఇంచు ఇంచులోన పొంచి ఉన్నా ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో..
నా ఇంటి ముందూ రోజు వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందును
నిండు నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వు రయ్యో..
ఈ దారిలోని గందరగోళాలే మంగళవాయిద్యాలుగా..’
ప్రియురాలిని తన గుండెల్లో పెట్టి చూసుకుంటానంటూ ప్రియుడు వైనవైనాలుగా చెబుతున్నాడీ పాటలో.
పవన్ సీహెచ్ సంగీతం సమకూర్చగా అరుణ్ కులకర్ణి ఈ పాటను ఆలపించారు. సాంగ్ మధ్యలో చరిత్రలోని ప్రఖ్యాత ప్రేమజంటలు అబ్దుల్లా- తారామతి, కిర్క్ ప్యాట్రిక్-ఖైరున్నీసా తదితరులతో సంబంధమున్న ప్రదేశాలను జత చేశారు.

తెలుగు సినీగేయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న మిట్టపల్లి సురేందర్.. భావోద్వేగాలను అక్షరాల్లో పలికించడంతో దిట్ట. పల్లె జీవితాలను కవిత్వంలా చూపే మట్టిపాటైనా, ఉరకలెత్తించే ఉద్యమ పాటైనా ఆయన గుండెను తాకేలా అక్షరీకరిస్తారు. అలాంటి మిట్టపల్లితో శేఖర్ కమ్ముల ప్రేమ పాట రాయించారు. ‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా..’ పాటకు నంది అవార్డు అందుకున్న సురేందర్ చక్కని గాయకుడు కూడా. నాన్ స్టాప్, ధైర్యం, రాజన్న, సత్యాగ్రహి వంటి చిత్రాలకు పాటలు రాసిన సురేందర్ ‘లవ్ స్టోరీ’ చిత్రంతో ప్రేమకు కొత్త నిర్వచనాలు రంగరిస్తూ మనముందుకొచ్చారు. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ రొమాటింక్ డ్రామా చిత్రం ఏప్రిల్ 16న విడుదల కానుంది.