ప్రబుద్ధుల లైంగిక వేధింపులపై మొదలైన మీటూ ఉద్యమం ఊహించినట్లుగానే అధికార పీఠాలను కదిలిస్తోంది. పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు తెగబడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి, ప్రముఖ పాత్రికేయుడు ఎంజే అక్బర్‌ను ఇంటికి సాగనంపనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బీజేపీ కంటే ఆరెస్సెస్ తీవ్ర ఆగ్రహంతో ఉందని, అతణ్ని వెంటనే కేబినెట్ నుంచి తప్పించాని ఆదేశాలు జారీచేసిందని వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం నైజీరియా పర్యటనలో ఉన్న అక్బర్‌తో మొత్తం వ్యవహారంపై వివరణ ఇప్పించి, క్షమాపణలు చెప్పిస్తారని, తర్వాత రాజీనామా చేయిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అక్బర్ శుక్రవారం దేశానికి రావాల్సింది. అక్బర్ గతంలో వివిధ పత్రికలకు సంపాదకుడిగా పనిచేసినప్పుడు మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. ప్రియారమణి గత ఏడాదే ఆయనపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. గజాలా వహాబ్, సబా నక్వీ, సుతాపా పాల్, సుమా రాహా, సుపర్ణా శర్మ, ప్రేరణా సింగ్ బృందా తదతరులు కూడా ఆరోపణలు చేశారు. దీంతో అతణ్ని మోదీ.. ‘గౌరవ ప్రదంగా’ ఇంటికి పంపడానికి అన్నీ సిద్ధం చేశారని, బీజేపీ అలాంటి వారిని ఉపేక్షించదనే సందేశం ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.