శనివారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. హైదరాబాద్ నగరంలో పోలీసులు వాహనదారులను ట్రాఫిక్ చలాన్లతో వేధిస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారాయన. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడో చాటుగా ఉండి ఫొటోలు తీసి, చలాన్లు వేస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే పెరిగిన ధరలతో పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలోనూ ట్రాఫిక్ పోలీసులు వెంటపడి మరీ జరిమానాలు విధిస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. కానిస్టేబుల్, ఎస్సైల ఎంపికలో మారిన నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని అక్బరుద్దీన్ అన్నారు. అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. కొత్త నిబంధనలు రద్దు చేసి పాతవే అమలు చేయాలని కోరారు.