నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్న సమయంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఆదివారం బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. తాను మాట్లాడింది తెలంగాణ మహిళలంతా చూశారని, తాను ఎకడా తప్పు మాట్లాడలేదని, బండి సంజయ్‌కి కౌంటర్‌గా మాట్లాడానని వివరణ ఇచ్చారు. సంజయ్ క్షమాపణ చెప్తే తాను కూడా క్షమాపణ చెప్తానని స్పష్టం చేశారు. బీజేపీ ఒక సైకో పార్టీ అయిందని, సైకోలు అందరూ ఒక గ్రూప్‌గా మారి బీజేపీలో కలిశారని విమర్శించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ బీజేపీ దేశంపై పడి దోచుకు తింటున్నదని, ఎన్నికలు రాగానే శత్రు దేశాలపై యుద్ధం ప్రకటించినట్టు కేంద్ర ఏజెన్సీలతో ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయిస్తున్నదని విమర్శించారు. మహిళా లోకం చెప్పుతో కొట్టే పరిస్థితిని బండి సంజయ్ తెచ్చుకొన్నారని ధ్వజమెత్తారు.
లింగయ్య ఏమన్నారంటే..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ‘‘బండి సంజయ్.. నేను అడుగుతున్నా ఈ రోజు.. నీ భార్యే కావచ్చు.. నీ పార్టీ నాయకుల భార్యలే కావచ్చు.. మా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులందరూ మీ పెళ్లాలకు ముద్దులు పెడతరు.. ఊర్కుంటరా? ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడకపోతే చెప్పు తీసుకొని కొడతాం’’ అంటూ చిరుమర్తి లింగయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో శనివారం నిర్వహించిన ధర్నాలో.. మహిళా లోకం తలదించుకునే విధంగా మాట్లాడిన సంజయ్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
పీఎస్ లో ఫిర్యాదు
అయితే ఎమ్మెల్యే లింగయ్య వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నకిరేకల్‌లో ఆదివారం ధర్నా చేసి ఎమ్మెల్యే చిరుమర్తి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యేపై నకిరేకల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.