MLA Etela Rajender addressed the BJP assurance meeting of Mallya Praja Gosa of Jagtial district.
mictv telugu

మద్యం అమ్మకాల్లో దేశంలోనే తెలంగాణ ఫస్ట్ ప్లేస్

February 25, 2023

MLA Etela Rajender addressed the BJP assurance meeting of Mallya Praja Gosa of Jagtial district.

సీఎం కేసీఆర్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడంలో విఫలమయ్యారు కానీ మద్యం తాగించడంలో మాత్రం గొప్పగా నిలిచాడని మాజీ మంత్రి హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల ప్రజాగోస బీజేపీ భరోసా సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించని ముఖ్యమంత్రి కేసీఆర్… దేశ వ్యాప్తంగా ఎలా సేవ చేస్తారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ వంటి పార్టీలను ముఖ్యమంత్రి కేసీఆర్ బలహీనపరిచారని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్కు ధీటైన పార్టీ బీజేపీనేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. రైతు బంధు పథకంతో రూ.5000 చెల్లించిన ప్రభుత్వం.. ధాన్యం కోత పేరుతో మరో చేతితో రూ.5000 వసూలు చేసుకున్నారని విమర్శించారు. మద్యం అమ్మకాల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయబోయేది బీజేపీనని చెప్పిన ఆయన..ప్రస్తుతం అమలయ్యే సంక్షేమ పథకాలకు నిధులు సీఎం కేసీఆర్‌ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బులను తిరిగి ఇస్తున్నాడని అన్నారు.

ఇటీవల పురపాలక అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసిన బోగ శ్రావణిని ఈటల రాజేందర్ జగిత్యాలలో నిన్న పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష పార్టీలతో ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలపై చర్చలకు చట్టసభలు హుందాగా, గొప్ప వేదికలుగా ఉండేవని, కానీ సీఎం కేసీఆర్‌ ఏలుబడిలో ఎమ్మెల్యేలు, ఎంపీలంటే అధికార పార్టీకి చెందిన వారే తప్ప, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలకు గౌరవం, మర్యాద లేదని ఆరోపించారు. పరాకాష్ఠకు చేరిన రాజకీయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గడ్డిపోచల్లాగా తీసివేస్తున్నారన్నారు.