ఏపీ ఎమ్మెల్యే ఏశాడ్రోయ్.. ఆ యుద్ధం వల్లే కరెంటు చార్జీలు పెరిగాయంట.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ ఎమ్మెల్యే ఏశాడ్రోయ్.. ఆ యుద్ధం వల్లే కరెంటు చార్జీలు పెరిగాయంట..

May 16, 2022

మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడంలో రాజకీయ నాయకుల తర్వాతే ఎవరైనా. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు తమ ప్రభుత్వం బాధ్యత కాదంటూ చాలా బాగా సమర్ధించుకుంటారు. తాజాగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. ఖర్చులు పెరిగాయంటున్న వాపోయిన మహిళకు చాలా నేర్పుగా, పద్ధతిగా భరించక తప్పదంటు తాపీగా సమాధానమిచ్చారు. ఇటీవల ఆ రాష్ట్రంలో కరెంట్ కోతలే , పవర్ హాలీ డే కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని వల్ల మండే ఎండల్లో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండలకు అల్లాడుతూ, ఇండ్లల్లో కరెంట్ లేక నరకయాతన అనుభవించారు.

ఇదే క్రమంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న భీమవరం ఎమ్మెల్యేను ఆ నియోజకవర్గంలోని మహిళ జగనన్న ప్రభుత్వంలో కరెంట్ బిల్లులు పెంచుతున్నారంటూ అమాయకంగా అడిగింది. అందుకు సమాధానంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కారణంగా భారతదేశానికి బొగ్గు దిగుమతి తగ్గిందని, తద్వారా బొగ్గు ఖర్చులు పెరిగాయని చెప్పారు. ఆ ఖర్చుల్లో కూడా ఏపీ ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో మినహా నిరంతంరంగా కరెంట్ ఇస్తున్నామని, ఏదో నామమాత్రంగా బిల్లులు పెంచుతున్నామన్నారు. అయినా ఖర్చులనేది పెరగకుండా ఉంటాయా అని ఆమె ప్రశ్నకు సమాధానంగా చెబుతూ.. పక్కనున్న ఓ పాపను చూపిస్తూ “ఈ పాప వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఉంటుందా? పెరుగుతుంది కదా” అని లాజిక్ గా మాట్లాడారు. ఆ అమాయక మహిళ అవునన్నట్లుగానే తల ఊపింది.