పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య మళ్లీ వార్తలెక్కారు. మొగులయ్య స్థలం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఆయనకు హైదరాబాద్ శివారులోని బీఎన్ రెడ్డి నగర్‌లో స్థలం ఇవ్వడం సబబు కాదని, నడిబొడ్డులోని బంజారాహిల్స్ లేదా జూబ్లీ హిల్స్‌లలో ఇవ్వాలని అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు. క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను లక్ష్యంగా విమర్శలు సంధించారు. ‘‘క్రీడాకారులకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో ఇంటి స్థలం ఇచ్చారు. కిన్నెరమెట్ల కళాకారుడు మొగిలయ్యకు మాత్రం ఊరి బయట ఇచ్చారు. కళాకారులకు కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోనే స్థలం ఇవ్వాలి. శ్రీనివాస్ గౌడ్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తాను’’ అని బాలరాజు అన్నారు.
మొగలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం బీఎన్ రెడ్డి నగర్‌లో 600 గజాల ఇంటిస్థలంతోపా కోటి రూపాయల నగదు పురస్కారం ప్రకటించడం తెలిసిందే. బుధవారం రాజ్ భవన్‌లో ఆయన స్థలం పట్టా అందజేశారు. అయితే బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్‌లకు ప్రభుత్వం రూ. 2 కోట్ల నగదుతోపాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువచేసే ఇళ్ల స్థలాను ఇవ్వడంతో ఆయన శివారులో ఇవ్వడంతో వివక్ష చూపుతున్నారని విమర్శలు వస్తున్నాయి.