తెలంగాణలో యశ్వంత్ సిన్హా పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతల మధ్య కొత్త చిచ్చు రేగింది. శనివారం యశ్వంత్ సిన్హాను, వీహెచ్ కలవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎవరి ఇష్టమొచ్చినట్టు వాళ్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. పైగా బండకేసి బాదుతానన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు.
బండకేసి కొడతానన్న రేవంత్ వ్యాఖ్యలపై.. మేమేమైనా పాలేర్లమా అంటూ ఫైరయ్యారు. టెంప్ట్ అయ్యే వాడివి పీసీసీ పోస్టుకు ఎలా అర్హుడయ్యావన్న జగ్గారెడ్డి .. పీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ ను తొలగించాల్సిందిగా హైకమాండ్ కు లేఖ రాస్తానన్నారు. నూటికి నూరు శాతం రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి లేకపోయినా పార్టీని నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. వీహెచ్ వయసు ఎక్కడ..? నీ వయసు ఎక్కడ అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. నువ్వు పోరగానివి.. బండకేసి ఎవర్ని కొడతావంటూ ఆయన ప్రశ్నించారు. పీసీసీ పోస్ట్ దిగి చూస్తే.. నీకేం విలువ వుంటుందని జగ్గారెడ్డి నిలదీశారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.