తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన వేర్వేరు నోటిఫికేషన్లు మార్చి 6న వెలువడనున్నాయి. మార్చి 13 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఇక మార్చి 14న నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణకు మార్చి 16 వరకు గడువు ఉంటుంది. మార్చి 23న పోలింగ్ జరుగనున్నట్లు, అదే రోజు కౌంటింగ్ కూడా నిర్వహించనున్నట్లు ఈసీఐ తెలిపింది.
తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నవీన్‌రావు, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం ముగియనున్నది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2017లో ఎమ్మెల్యే కోటాలో మండలి సభ్యుల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ లోగా కొత్త సభ్యుల నియామకం కోసం ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.
తాజా షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎమ్మెల్సీల్లో నారా లోకేశ్, భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పెనుమత్స సూర్య నారాయణరాజు, గంగుల ప్రభాకర్‌రెడ్డిల పదవీకాలం మార్చి నెలాఖరులో ముగియనుంది. ఎమ్మెల్సీ ఛల్లా భగరీథ రెడ్డి గత నవంబర్ లో మరణించారు. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది.