ఎమ్మెల్యే చెల్లెలి కుటుంబం మృతిపై అనుమానాలు.. అసలేం జరిగింది?  - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యే చెల్లెలి కుటుంబం మృతిపై అనుమానాలు.. అసలేం జరిగింది? 

February 17, 2020

Mla manohar reddy.

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెల్లెలు రాధ కుటుంబం కరీంనగర్ అల్గునూరు కాకతీయ కెనాల్లో విగతజీవులుగా కనిపించడం కలకలం రేపుతోంది. ఇది ప్రమాదమేనా? లేకపోతే దీని వెనుక ఐదైనా కుట్ర ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. రాధ కుటుంబం 15 రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిందని పొద్దున్నుంచీ వార్తలు రాగా, 22 రోజుల కిందటే వెళ్లిందని తాజాగా తెలుస్తోంది. 

కరీంనగర్‌కు చెందిన రాధ, ఆమె భర్త సత్యనారాయణరెడ్డి, కూతురు వినయశ్రీ మృతిని పోలీసులు అనుమానాస్పద మృతి కింద భావిస్తూ కేసు నమోదు చేశారు. ఈ కుటుంబం తరచూ విహార యాత్రలకు వెళ్తుంటుంది కనుక ఈసారి కూడా అలాగే వెళ్లి ఉంటారని భావించామని బంధువులు చెబుతున్నారు. వారి ఫోన్లు సిచ్చాఫ్ కావడంతో  పోలీసులకు సమాచారం అందించామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెప్పారు. అయితే పోలీసులు అప్పటి నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదని అనుమాను వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే స్పందించారు. 

‘నాకు నా చెల్లెలంటే నాకు ప్రాణం. ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరిపించుకోండి. మా చెల్లెలి కుటుంబంతో నాకు ఎలాంటి గొడవలూ లేవు..వారు గత నెల 27న ఇంటి నుంచివెళ్లారు. వంతెన ఇరుగ్గా ఉండడం, రెయిలింగ్ కూడా లేకపోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నాం..’ అని అన్నారు. ఈ కేసు విషయంలో పోలీసులకు ఫిర్యాదు అందిందో లేదో తెలియడం లేదు. కాల్ డేటా సేకరిస్తున్నామని, మృతుల ఆర్థిక లావాదేవీలతో పాటు అన్ని అంశాలను నిగ్గుదేలుస్తామని పోలీసులు చెబుతున్నారు. ఎమ్మెల్యేకు చిన్న చెల్లెలైన రాధ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త ఎరువుల దుకాణం నడుపుతున్నారు. కూతురు నిజామాబాద్‌లో దంత వైద్య కళాశాలలో చదువుతోంది.