నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఒకే వేదికపై 220 పేద జంటలకు సామూహిక వివాహం జరిపించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 900 ఫీట్లతో చేసిన కళ్యాణ వేదికపై 220 పందిళ్లు వేశారు. అందులో ఒక్కో జంటకు పెళ్ళి చేసేందుకు 8 ఫీట్ల పొడవు, 6 ఫీట్ల వెడల్పు ప్రదేశంలో ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు 220 మంది పూజారులతో హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ ఘన కార్యాన్ని జరిపించారు. ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టు చైర్మెన్ అయిన మర్రి జనార్ధన్ రెడ్డి ప్రతీ ఏటా సామూహిక వివాహాలు జరిపిస్తారు. ఇది వరుసగా ఐదో ఏడాది కావడం గమనార్హం. వివాహాల తర్వాత అందరికీ అక్కడే భోజన ఏర్పాట్లు చేశారు. తర్వాత ప్రతీ జంటకు మంచం, పరుపు, దుప్పటి, బీరువా, మిక్సీ, స్టీల్ సామాగ్రి, కుక్కర్, రెండు కుర్చీలను ఉచితంగా అందించి దీవించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.