హైదరాబాద్..పాతబస్తీలో కరెంట్ బిల్లుల వసూళ్లు చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. బిల్లులు వసూలు చేసేందుకు వెళ్తున్న వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొండి బకాయిలను అడిగితే ప్రజలే ఎదురుతిరిగి దాడి చేసిన పరిస్థితులు ఇప్పటి వరకు ఉంటే…ఇప్పుడు సాక్షాత్తు ప్రజాప్రతినిధులే అక్కమార్కులకు అండగా నిలుస్తున్నారు. బిల్లులు వారు కట్టరు ఇక్కడి నుంచి నువ్వు వెళ్లిపో అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే ఓ అధికారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
అసలు ఏం జరిగిందంటే.. ఓల్డ్ సిటీలో అల్ జుబెల్ కాలనీ..సలాం పూర్ ఫ్యామిలీస్ ఏరియాలో విజిలెన్స్ అధికారులు దాడులు చేసి బిల్లు కట్టని వారి మీటర్లను సీజ్ చేశారు. దీంతో స్థానికులు స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యే అధికారులపై ఫైర్ అయ్యారు. ఎవర్ని అడిగి నా నియోజకవర్గంలోకి అడుగుపెట్టారంటూ మండిపడ్డారు. ఓవరాక్షన్ చేస్తే రియాక్షన్ మరోలా ఉంటుందని హెచ్చరించారు. సీజ్ చేసిన మీటర్లను మర్యాదగా ఇచ్చి వెళ్లిపోవాలని సూచించారు. మరోసారి తన నియోజకవర్గంలోకి వచ్చేముందు తన అనుమతి తీసుకోవాలన్నారు. దీంతో చేసేది ఏంలేక ఆ అధికారి..ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మజ్లీస్ ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పాతబస్తీలో కరెంట్ బిల్లుల మొండిబకాయిలో భారీగా ఉన్నాయి. అటువంటిది ఎమ్మెల్యేనే అక్రమాలను ప్రోత్సహితస్తే పరిస్థితి ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.