సరైన ఆధారాల్లేవ్.. నిందితుల రిమాండ్ తిరస్కరణ - MicTv.in - Telugu News
mictv telugu

సరైన ఆధారాల్లేవ్.. నిందితుల రిమాండ్ తిరస్కరణ

October 28, 2022

 

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. సరైన ఆధారాలు లేవన్న న్యాయస్థానం వారిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ (పీసీ) యాక్ట్ ఈ కేసులో అప్లికేబుల్ కాదని చెప్పినట్లు సమాచారం. అభియోగాల్లో పేర్కొన్నట్టుగా ప్రలోభాలు పెట్టేందుకు ఇవ్వజూపిన నగదు, దానికి సంబంధించిన ఆధారాలు లేకపోవటంతో రిమాండ్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అలాగే, 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చిన తర్వాతే విచారించాలని న్యాయమూర్తి జి.రాజగోపాల్ పోలీసులను ఆదేశించారు.

అరెస్ట్ సందర్భంగా లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) వర్తించదని పేర్కొన్నారు న్యాయమూర్తి. ప్రలోభాల కేసులో అరెస్ట్ అయిన నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌లను  పోలీసులు గత రాత్రి సరూర్‌నగర్‌లోని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లి హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో వారిని విడిచిపెట్టినట్టు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.