అన్నా క్యాంటీన్ ప్రారంభించిన టీడీపీ ఎమ్మెల్యే..
ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతకు ముందు వున్న అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయి. కేవలం రాజకీయం చేయడానికే వీటిని మూసేశారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపత్యంలో క్యాంటీన్ను తాను నడుపుతానంటూ టీడీపీ నేత, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ముందుకువచ్చారు. విశాఖ కేజీహెచ్ దగ్గరున్న అన్నా క్యాంటీన్‌ను ఆయన తిరిగి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్నా క్యాంటీన్‌లను తెరిచే వరకు కేజీహెచ్ వద్ద వున్న అన్నా క్యాంటీన్‌ను తన సొంత నిధులతో నిర్వహిస్తానని చెప్పారు. గతంలో కంటే మంచి భోజనం పెడతానని ఆయన స్పష్టంచేశారు.
రోజుకు 300-350 మందికి కడుపునిండా భోజనం పెట్టే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ‘విశాఖ కేజీహెచ్‌కు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రతిరోజూ వందల సంఖ్యలో చికిత్స కోసం వస్తుంటారు. వీరిలో 500 నుంచి 600 మంది అన్నా క్యాంటీన్‌లో భోజనం చేసేవారు. కానీ, ప్రభుత్వం వీటిని మూసివేయడం వల్ల నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే వారికి విశాఖలో భోజనం చేయ్యాలంటే సుమారు రూ.150 రూపాయలు పెడితే గానీ దొరకడం లేదు’ అని గణేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటీన్‌లను తిరిగి తెరవాలని తెలుగుదేశం పార్టీ నేతలు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.