రాష్ట్ర బీజేపీలో మరోసారి అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో రచ్చను రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలు.. ఒకరి వ్యాఖ్యలను ఒకరు మీడియా సాక్షిగా తప్పుబడుతున్నారు. బండి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తప్పుబట్టగా… అర్వింద్ వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితపై చేసిన వ్యాఖ్యల్ని బండి సంజయ్ వెనక్కి తీసుకుంటే బాగుంటుందని అర్వింద్ సూచించగా… బండి సంజయ్ మీద అరవింద్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజాసింగ్.
ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదు
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదని అన్నారు. బండి సంజయ్ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడని… ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదనే నాలెడ్జ్ అతనికి ఉందని చెప్పారు. అర్వింద్‌కి ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా సంజయ్‌తో మాట్లాడాలే తప్ప మీడియా ముందుకు వచ్చి కామెంట్లు చేయడం తప్పు అని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి మంచి స్పందన ఉందని… వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ఎంపీ అర్విద్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
“అర్వింద్‌కు ఏమైనా ఇబ్బంది ఉంటే బండి సంజయ్‌తో డైరెక్ట్ గా మాట్లాడాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆయనతో మాట్లాడొచ్చు. మీరు కూడా ఎంపీ, ఆయనతో ఢిల్లీలో కలుస్తుంటారు. కానీ డైరెక్ట్ మీడియాలో వచ్చి మాట్లాడడం తప్పు. మీరు చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవాలని అర్వింద్‌ను కోరుతున్నాను. మీరు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలని సూచిస్తున్నాను.” – రాజాసింగ్
బండి అనుచిత వ్యాఖ్యలు
ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత ఈడీ విచారణకు హాజరైన రోజు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంజయ్ మాట్లాడుతూ.. ‘ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత దోషిగా తేలితే అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా’ అని వాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. బండి సంజయ్ మహిళలకు క్షమాపణలు చెప్పాలని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆయనను బీజేపీ నుంచి బహిష్కరించాలన్నారు. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు.
ఇంతకీ ఎంపీ అర్వింద్ ఏమన్నారంటే
ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవితపై బండి చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని ఆ పార్టీ ఎంపీ అర్వింద్ అన్నారు. తెలంగాణలో సామెతలు చాలా ఉంటాయని, వాటిని జాగ్రత్తగా వాడాలని బండి సంజయ్ కు బీజేపీ ఎంపీ అర్వింద్ సూచించారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం అంటే పవర్ సెంటర్, పవర్ హౌస్ కాదని, కో ఆర్డినేషన్ చేసుకోవడం వారి బాధ్యత అన్నారు. కనుక ఇష్టరీతిన మాట్లాడకూడదని సూచించారు. కవితపై చేసిన వ్యాఖ్యల్ని బండి సంజయ్ వెనక్కి తీసుకుంటే బాగుంటుందని సూచించారు.
మహిళా కమిషన్ నోటీసులు
మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత ఈడీ నోటీసుల సందర్భంగా బండి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇదే అంశంపై బండి సంజయ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.