తెలంగాణలో దళితుల అభ్యున్నతికి ఉద్దేశించిన దళిత బంధు పథకం అభాసుపాలవుతోంది. అధికార పార్టీ నేతలే లబ్దిదారులుగా ఉంటూ పేద దళితులను విస్మరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తమ్ముడు తాటికొండ సురేశ్ దళిత బంధు పథకంలో లబ్దిదారుడిగా ఎంపికయ్యారు. ఈయన స్టేషన్‌ఘన్‌పూర్ సర్పంచ్‌గా ఉన్నారు. ఈయనతో పాటు ఎంపీపీ భర్త, మరికొందరు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆర్థికంగా ఉన్నవారిని, అధికార పార్టీ కార్యకర్తలను, ఎమ్మెల్యే అనుచరులను పథకంలో చేర్చడంపై స్థానిక దళితులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు, యువకులు సామాజిక మాధ్యమాల్లో తమ నిరసనను తెలియజేశారు. కాగా, దళిత బంధు పథకం కింద కేవలం పేదలనే ఎంపిక చేయాలనే నియమం ఏమీ లేదని అధికార పార్టీ నేతలు సమర్థించుకుంటున్నారు.