ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తనకు రూ.10 కోట్లు ఆఫర్ చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను దొంగ ఓట్లతోనే గెలిచానని.. తన సొంత గ్రామం చింతలమోరిలో తనకు భారీగా దొంగ ఓట్లు పడ్డాయని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ గ్రామానికి చెందినవారే కాక పక్క గ్రామాల నుండి వచ్చిన కొందరు సైతం తనకు దొంగ ఓట్లు వేసేవారని అన్నారు. ఒక్కొక్కరు 10 దొంగ ఓట్లు వేయడం వల్లే గెలిచేవాడినని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి నా గెలుపుకు కారణం దొంగ ఓట్లే అని వరప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
జనసేన తరఫున గెలిచి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న ఈ ఎమ్మెల్యే గారు గత శుక్రవారం రాత్రి అంతర్వేదిలో వైసీపీ నేతలు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేయాలని టీడీపీ ఎమ్మెల్యే రామరాజు నుంచి తనకు ఆఫర్ వచ్చిందన్నారు. అయితే తాను కమిట్మెంట్‌తో జగన్మోహన్‌రెడ్డి వెంట ఉన్నానని చెప్పినట్లు తెలిపారు. ‘వైసీపీకి ఓటేశాను. సిగ్గు, శరం విడిస్తే రూ.10 కోట్లు వచ్చేవి. ఒక్కసారి పరువుపోతే సమాజంలో బతకలేం’ అని చెప్పారు. తన వ్యాఖ్యలపై రాపాక ఆదివారం వివరణ ఇస్తూ మళ్లీ అవే వ్యాఖ్యలు చేశారు.