MLA Rohit Reddy filed a police complaint against the three persons for tempting them
mictv telugu

‘రూ.100 కోట్లు ఇస్తాం.. బీజేపీలో చేరకపోతే తప్పుడు కేసులు పెడతాం’

October 27, 2022

తమను టీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరాలని ప్రలోభాలకు గురిచేసినందుకు ముగ్గురి వ్యక్తులపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతారావు లను పార్టీ మారాలంటూ కొందరు ప్రలోభాలకు గురిచేశారని కంప్లయింట్ ఇచ్చారు.

రాజేంద్రనగర్‌ ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీలో చేరితే రూ.100కోట్లు ఇప్పిస్తామని రోహిత్‌రెడ్డికి సతీష్‌ శర్మ అలియాస్‌ రామచంద్ర భారతీ ఆఫర్ చేశారని.. నందకిశోర్‌ (నందు) మధ్యవర్తిత్వంతో ఫామ్‌హౌస్‌కు సతీష్‌ శర్మ, సింహయాజి వచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే రూ.100కోట్లు ఇస్తామని బీజేపీ తరఫున వారు హామీ ఇచ్చినట్లు పైలట్‌ రోహిత్‌ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.

ఆ పార్టీలో చేరకపోతే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేస్తామని బెదిరించినట్లుగా ఆయన పేర్కొన్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు. బీజేపీలో చేరితే సెంట్రల్‌ సివిల్ కాంట్రాక్టులతోపాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారంటూ రోహిత్ రెడ్డి చెప్పిన విషయాన్ని పోలీసులు పేర్కొన్నారు. తనకు రూ.100కోట్లు, తనతో ఆ పార్టీలో చేరే వారికి రూ.50కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేసినట్లు రోహిత్‌ రెడ్డి తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.