తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 ఫలితాలు ప్రకటించి, ఆ తర్వాత ఎందుకు రద్దు చేసిందో జవాబు చెప్పాలని అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేవారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అక్రమాలు సాగుతున్నాయని ఆయన మంగళవారం ఆరోపించారు. నీళ్లు, నియామకాలు, నిధుల డిమాండ్లపై ఆంధ్రాపాలకులతో కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని, అయితే తెలంగాణ యువతకు చివరికి మొండిచేయే మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం పోరాడిన యువతీయువకుల సంక్షేమం గురించి కేసీఆర్ సర్కారు ఏమాత్రం పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు అప్పులతో, పంటలకు సరైన గిట్టుబాటు ధరల్లేక అల్లాడిపోతున్నారని, అసెంబ్లీలో ఈ సమస్యలపై చర్చకు సర్కారు ముందకు రాకపోవడం శోచనీయమని అన్నారు.