ఇటీవల ఓ మహిళా ఎమ్మెల్యేపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనన ఆరోపణలతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయాడు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్‌ను లైగికంగా వేధిస్తున్నారని, నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వార్తలతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. ముందు ఇదంతా రాజకీయ కుట్ర అన్న ఆయన.. ఆ తర్వాత నేరుగా సర్పంచ్ ఇంటికి వెళ్లి పొరపాటు అయిందని, క్షమించాలని రాజీ కుదుర్చుకున్నాడు. అంతటితో ఆ వివాదం సద్దుమణిగినట్లయింది. ఇదిలా ఉండగా.. మరోసారి వార్తల్లో నిలిచాడు రాజయ్య.
జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో సోమవారం జరిగిన రేణుక ఎల్లమ్మ బోనాల పండుగకు హాజరయ్యాడు ఎమ్మెల్యే. స్థానిక మహిళలు ఆయనకు బోనం ఎత్తి పూజలు నిర్వహిస్తుండగా.. దగ్గర్లో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా కదిలాయి. అవి అక్కడున్న భక్తులపై దాడి చేయడంతో జనాలు పరుగులు తీశారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే వ్యక్తి గత సిబ్బంది రాజయ్యను సురక్షితంగా వాహనంలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి ఆయన వెళ్లిపోయారు. తేనెటీగల దాడితో స్థానిక ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. యువకులు కొందరు ధైర్యం చేసి చిన్నపిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కొందరికి గాయాలు కాగా వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామస్థులందరూ కలిసి ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ వేడుకల్లో ఈ ఘటన జరగడంతో గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.