వైసీపీపై ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఫైరయ్యారు. త్వరలోనే తనను అవమానించిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. సీఎం జగన్ దెబ్బకు తన మైండ్ బ్లాంక్ అయిందన్నారు. తనను పిచ్చి కుక్కతో సమానంగా చూశారని వాపోయారు. పార్టీ కోసం కష్టపడితే వివరణ తీసుకోకుండానే సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. తనకు షాక్‌లు మీద షాకుల ఇచ్చారని వ్యాఖ్యానించారు. అనారోగ్యంలోనూ సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం కోసం ప్రతి గ్రామంలో తిరిగానని పేర్కొన్నారు. అలాంటిది తనపై సస్పెన్షన్ వేటు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని ఉద్దండయ్యపాలెంలో ఇసుక మాఫియాకు అడ్డం వచ్చినందుకే పార్టీ నుంచి తప్పించారని ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపించారు.
ప్రాణహాని ఉంది
వైసీపీ నుంచి సస్పెండ్ తర్వాత తన ఆఫీస్ పై దాడి జరగడం దారుణమన్నారు. మొన్నటివరకు తనతో పాటు ఉన్నవారే దాడి చేశారని తెలిపారు. “నాకు ప్రాణ హాని ఉంది నాకేం జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత వహిస్తాడు. నాపై కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడుతున్నారు”అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు కలిసి వస్తే నేను వారి సమస్యపై పోరాటం చేస్తానని పిలుపు నిచ్చారు.
జగన్‌కు విలులేవి ?
సీఎం జగన్‌కు విలువలు లేవని విమర్శించారు. వైఎస్సార్ తనయుడు అంటే విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారనుకొని మోసపోయానన్నారు.
అమరావతి రైతుల కోసం ప్రాణం పోయేదాకా పోరాటం చేస్తాని ఉండవల్లి శ్రీదేవి ప్రకటించారు. తను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నట్లు వెల్లడించారు. ఇంకా ఏ పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు.