జనాల‌పైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు.. 22 మందికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

జనాల‌పైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు.. 22 మందికి గాయాలు

March 12, 2022

bjp

ఒడిశా రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే కారు జనాల మీదికి దూసుకెళ్లడంతో 22 మందికి తీవ్రగాయాలైనా సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖుర్ధా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం పంచాయతీ సమితి చైర్ పర్సన్ ఎన్నికలు జరుగుతుండగా బాన్‌పుర్ బ్లాక్ ఆఫీస్ ముందు ఉన్న ప్రజలపై చిలికా ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ తన కారుతో దూసుకెళ్లారు. దీంతో 22 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఏడుగురు పోలీసులు ఉన్నారు. ఆగ్ర‌హాంతో రగిలిపోయిన ప్ర‌జ‌లు.. ఆ ఎమ్మెల్యేపై తిర‌గ‌బ‌డి చిత‌క‌బాదారు. దీంతో ఎమ్మెల్యేకు కూడా తీవ్ర గాయాల‌య్యాయి.

నిజానికి చైర్‌పర్సన్ ఎన్నిక కోసం జగదేవ్ బాన్‌పూర్ బ్లాక్‌కు వెళ్లారు. అయితే బ్లాక్ ఆఫీస్ ముందు రద్దీగా ఉన్న ప్రజల వైపు జగ్‌దేవ్ తన వాహనాన్ని తీసుకెళ్లారు. అయితే అకస్మాత్తుగా అతని వాహనం జనం మీదకి దూసుకెళ్లింది. కారు దూసుకెళ్లడంతో ఏడుగురు పోలీసు సిబ్బందితో కలిపి 22 మందికిపైగా గాయపడ్డారు. ఇందులో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే‌ ప్రశాంత్ జగదేవ్‌పై ప్రజలు దాడి చేయడంతో పాటు, అతని కారును ధ్వంసం చేశారు. దీంతో అతనిని పోలీసులు రక్షించి, ఆస్పత్రికి తరలించారు.

అంతేకాకుండా జగదేవ్ బాధ్యతారాహిత్యంగా డ్రైవింగ్ చేశారని, ఘటనా సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపించారు. కాగా జగదేవ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో గత ఏడాది సెప్టెంబర్‌లో పార్టీ నుంచి బీజేడీ సస్పెండ్ చేసింది.