ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు తెలంగాణ హైకోర్టులో నిన్నటితో వాదనలు ముగిశాయి. ఈ విషయమై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన తీర్పును వెల్లడించింది. సిట్ విచారణ పారదర్శకంగా లేదని ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ సహా మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించి హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసును సీబీఐ విచారణకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఈ నెల 4వ తేదీన తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ కేసుపై అన్ని వర్గాల వాదనలను తెలంగాణ హైకోర్టు విన్నది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ ధవే వాదనలు విన్పించారు. ఇవాళ కూడా దుష్యంత్ ధవే తన వాదనలు విన్పించారు. కేసు దర్యాప్తు దశలో ఉండగా.. సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ విషయమై ఈ నెల 30వ తేదీ లోపుగా వాదనలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ.. బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో దాడులు చేస్తున్నాయని.. ఇవి కక్ష సాధింపు చర్యలకు ఇది నిదర్శనమని కోర్టుకు తెలిపారు దవే. సుప్రీంకోర్టు సైతం అతి తక్కువ సందర్భాలలో కేసులను సీబీఐకి అప్పజెప్పిందని.. అలాంటి సందర్భాలు ఎమ్మెల్యేలకు ఎర కేసులో వర్తించదని ఆయన పేర్కొన్నారు. సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు రద్దు చేసి.. సిట్ దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని దుష్యంత్ దవే సీజే ధర్మాసనాన్ని కోరారు.