ఎప్పటిలానే ఈసారి కూడా తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఓవైపు కరోనా వైరస్ వ్యాప్తి, మరోవైపు భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అల్లకల్లోలంగా మారింది. ఇకనుంచైనా తమను తమను చల్లగా చూడాలని రాష్ట్ర ప్రజలు గౌరమ్మను మొక్కుతున్నారు. ఈరోజు గునుగు, తంగేడు, సీతాకుచ్చులతో ఎంగిలి బతుకమ్మను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బతుకమ్మ పండుగ స్ఫూర్తితో మనందరం ఉమ్మడిగా కరోనాను ఎదుర్కొందామంటూ ట్విట్టర్లో తెలిపారు. ఈ క్రమంలో ఓ ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, సురక్షితంగా, సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకూడవద్దని తెలిపారు. కరోనా కారణంగా ఈ ఏడాది, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం లేదన్నారు. ఇదిలా ఉంటే కవిత ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ఆమె హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు.
మన తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక, ఆడబిడ్డల ఆనందాల హరివిల్లు బతుకమ్మ పండుగ సందర్భంగా..
ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు#MyBathukammaMyPride pic.twitter.com/FUdjZNecBt— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 16, 2020