ఖమ్మంలో బుధవారం జరిగిన టీడీపీ శంఖారావం సభ, చంద్రబాబు వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. చంద్రబాబును నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు. అతని రాజకీయాలు ఇక్కడ నడవవు అని తెలిపారు. చుక్కలెన్ని ఉన్నా చందమామ ఒక్కటేనంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్ని పార్టీలొచ్చినా..కేసీఆర్ ఒక్కరే ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ కాదన్నారు. గతంలో ఇక్కడి ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించారన్నారు. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. నిజామాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు.
రేపు రైతు మహాధర్నా
కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని కవిత మండిపడ్డారు. రైతన్నలను మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేట్లకే మోడీ వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై రేపు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘రైతు మహాధర్నా’ చేపడుతున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ ధర్నాలో రైతన్నలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ రైతుల సత్తా ఏంటో రేపటి ధర్నాతో చూపించాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుబంధం చేయాలని డిమాండ్ చేశారు.