ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ ఎట్టకేలకు ముగిసింది. దాదాపు 9 గంటలపాటు సుదీర్ఘ విచారణ జరిపిన ఈడీ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమెకు ఇక వెళ్లొచ్చని చెప్పారు. ఈనెల 16న మళ్లీ విచారణకు రావాలని ఆమెను కోరినట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 8 వరకు సాగింది. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య భోజనానికి విరామమిచ్చారు. ఈ కేసులో అరెస్టయిన హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలసి సాయంత్రం సెషన్‌లో విచారించారు. ముఖ్యంగా 100 కోట్ల ముడుపులు, 10 ఫోన్ల విధ్వంసం వంటి అంశాలపై ఇద్దరీనీ కూపీ లాగినట్లు తెలుస్తోంది. సమాధానాలివ్వడానికి కవిత చాలా సమయం తీసుకోవడంతో విచారణ ఆలస్యమైనట్లు సమాచారం. ఆమెకు మొత్తం 26 ప్రశ్నలు సంధించారు. రాత్రి పూట మహిళలను విచారించకూడదనే ఆదేశాల నేపథ్యంలో ఆమెను ఇంటికి పంపారు. తదుపరి కర్తవ్యంపై కవిత, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు న్యాయనిపుణులతో సంప్రదింపులు కొనసాగించనున్నారు.