MLC Kavitha criticized the central government for acting conspiratorially on the TS welfare schemes
mictv telugu

కచ్చితంగా మోదీ ఫొటో పెడతాం.. కానీ రేషన్ షాపుల్లో కాదు..

September 7, 2022

పేద ప్రజలకు, వికలాంగులకు, వృద్దులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఉచితాలు వద్దంటూ విష ప్రచారం చేస్తున్నారన్నారు. నిజామాబాద్‌లో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాతో కలిసి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ రూ.10 లక్షల కోట్లను తన మిత్రులకు పంచిపెట్టారని, ఎదో ఒక కారణంతో పథకాలను అమలు చేయకుండా చేయాలని కుట్ర జరుగుతోందన్నారు.

దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఈ మధ్య నిజామాబాద్ జిల్లాకు వచ్చి.. రేషన్ షాప్‌లో ప్రధాని ఫోటో లేదని కలెక్టర్‌తో గొడవ పడ్డారన్నారు. అసలు ప్రధాని ఫొటోలు రేషన్‌ దుకాణాల వద్ద పెట్టాల్సిన అవరసరం ఉందా? అని ప్రశ్నించారు కవిత. పెట్రోల్ బంకుల వద్ద, యూరియా బస్తాల మీద మోదీ ఫొటో కచ్చితంగా పెడతామని చెప్పారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో ఒకరకమైన ఆందోళనకర పరిస్థితులను సృష్టించాలని బీజేపీ నేతలు చూస్తున్నారన్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని, ఆ నమ్మకం తనకుందని కవిత అన్నారు.