ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల 20న కవిత విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులిచ్చింది.ఈ క్రమంలో ఆమె ఢిల్లీ వెళ్లారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేటీఆర్, ఎంపీ సంతోష్‌తో కలిసి హస్తినకు పయనమయ్యారు. అయితే రేపు ఆమె ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా డుమ్మా కొడతారా ? అన్నది సస్పెన్స్‌గా మారింది.
ఈడీ విచారణపై స్టే ఇవ్వాలంటూ ఇప్పటికే సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. అది ఈనెల 24న విచారణకు రానుంది. ఈ కారణంతో ఈనెల 16వ తేదిన జరగాల్సి ఉన్న ఈడీ విచారణకు కవిత హాజరుకాలేదు. తన పిటిషన్ సుప్రీం కోర్టులో ఉండడంతో విచారణకు హాజరుకాలేనంటూ ఆమె తమ లాయర్ ద్వారా ఈడీ అధికారులకు సమాచారం చేరవేశారు. అదే విధంగా మహిళను ఇంటి వద్ద విచారణ చేయకుండా ఆఫీస్ కు పిలిచి విచారించడంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపటి ఈడీ విచారణకు హాజరవ్వడంపై ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు ఈనెల 11న కవితను ఈడీ అధికారులు విచారించారు.
మరోవైపు సుప్రీంలో కవిత వేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ముందస్తు ఆర్డర్లు పాస్ చేయొద్దంటూ ఈడీ అధికారులు కోర్టును కోరారు. కవిత పిటిషన్ పైన సుప్రీంకోర్టు ముందస్తు ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈడీ సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని ఆసక్తికరంగా మారింది.