Mlc Kavitha Extends Her Support To Fund student Medical Education
mictv telugu

హారికకు నేనున్నా.. ఏ శక్తి అడ్డుకోలేదు : ఎమ్మెల్సీ కవిత

November 9, 2022

Mlc Kavitha Extends Her Support To Fund student Medical Education

యూట్యూబ్ ద్వారా క్లాసులు వింటూ ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా నాందేవ్ వాడ కు చెందిన హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న కవిత తక్షణమే స్పందించారు. నిజామాబాద్‌ పర్యటన సందర్భంగా హారికను కలిసిన ఆమె ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పారు. మొదటి ఏడాదికి సంబంధించి కాలేజీ ఫీజుని చెక్కు రూపంలో అందించారు.

చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని కవిత చెప్పారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించారని తెలిపారు. తనకున్న వనరులన్నీ సద్వినియోగం చేసుకొని ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హారిక ఎంబీబీఎస్ చదువులో రాణించి , డాక్టర్‌గా సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.

కవిత తన చదువుకు ఆర్థికంగా అండగా నిలిచినందుకుగాను హారికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తాను బాగా చదువుకొని కవిత గారు సూచించినట్లుగా సమాజానికి తోడ్పాటునoదిస్తానని హారిక అన్నారు. నిజామాబాద్‌కు చెందిన హారిక యూట్యూబ్‌లోనే క్లాసులు విని ఏకంగా ఎంబీబీఎస్‌లో రాష్ట్ర స్థాయిలో 700వ ర్యాంక్‌ సాధించింది.