ఈ నెల 9న విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్సీ కమితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన కవిత తాను విచారణకు ప్రస్తుతం హాజరు కాలేనని తాజాగా ఈడీకి లేఖ రాశారు. ఈ నెల 15 తరువాతే విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో మహిళల రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 10న నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నామని అందుకే విచారణకు రాలేనని కవిత లేఖలో తెలిపారు. కవితపై 177 /A 120/ B , 7of PC act కింద 2022లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే కవితను విచారించనున్నారు. గతంలోనూ కవితకు విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది.
తాజా పరిణామాల నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద ఎల్లుండి జరుగనున్న నిరాహార దీక్షలో కవిత పాల్గొంటారన్న స్పష్టత వచ్చింది. కవిత తలపెట్టిన ఈ దీక్షలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు పలు విపక్ష నేతలు పాల్గొంటాయి. ఈ దీక్షకు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా హాజరుకానున్నారు. కవిత దీక్షకు మద్దతుగా 18 పార్టీలకు చెందిన నేతలు దీక్షలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు, మహిళా హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు దీక్షలో భాగం కానున్నాయి. కవిత దీక్షకు సీనియర్ న్యాయవాది , రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ హాజరుకానున్నారు.