ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్టయితే ఏం చేయాలి? బీజేపీ చేసే దాడిని ఎలా ఎదుర్కోవాలి, ఏ ఆయుధాలతో తిప్పికొట్టాలి? కవితను కాపాడుకునేందుకు ఎలాంటి న్యాయ మార్గాలను అన్వేషించాలి? ఈ కేసులోని లూప్ హోల్స్ ఏమిటి? ఏ లాయర్‌ను రంగంలోకి దించాలి? ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుల ఆలోచనలివి. ఈ కేసులో కవితను గురువారం(ఈ నెల 16)న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రెండో విడత విచారణ జరపనుండడం తెలిసిందే. విచారణ తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం గ్యారంటీ అని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. అరెస్ట్ తర్వాత ఏం చేయాలో కార్యాచరణ కూడా రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు ఈ విషయాలు చెప్పారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ద న్యూస్ మినిట్ వెబ్‌సైట్ కథనం ప్రకారం..
బెయిలే కీలకం.
అరెస్ట్ తర్వాత కవితతో ఈడీ ఎలా వ్యవహరిస్తుందని కల్వకుంట్ల కుటుంబం ఆందోళనపడుతోంది. ‘‘కవితను ఈ డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకు జైల్లోనే ఉంచాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోందని కేసీఆర్ కుటుంబం భావిస్తోంది. ఆమెను జైల్లో ఉంచి ఎన్నికల ప్రచారంలో ఆ విషయాన్ని ఆయుధంగా వాడుకునే అవకాశం ఉంది. ప్రధాని, మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తారు. ‘‘సీఎం కూతురే జైల్లో ఉంది, జైల్లో ఉంది’’ అని ఎండగడతారు. ఆమెకు బెయిల్ రాకుండా అడ్డుకుంటారు.. దీన్ని ఎదుర్కోవాలంటే ఎలాగైనా సరే బెయిల్ తెచ్చుకోవడం కీలకం. ఈ కేసులో ఏ నిందితుడికైనా బెయిల్ వస్తే మిగతా వాళ్లకూ వస్తుంది. అందుకే బెయిల్ పిటిషన్లు పక్కాగా ఉండాలని, తిరుగులేకుండా భావిస్తోంది. ముఖ్యంగా కవిత బెయిల్ పిటిషన్ పటిష్టంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. అరెస్టయితే వేధింపులు ఉంటాయి. కవిత ఈ వేధింపులు తట్టుకుంటారు’’ అని సంబంధిత వర్గాలు చెప్పాయి.
తగ్గేదేలే, ఎమ్మెల్యేలకు ఎర కేసుతో
ఈ కేసును తిప్పికొట్టడానికి బీఆర్ఎస్, ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసును కూడా మళ్లీ గట్టి సాక్ష్యాలతో పైకి తెచ్చే అవకాశముంది. అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అవినీతిని గల్లీగల్లీలో ప్రచారం చేసే వ్యూహం ఉంది. ముఖ్యంగా ఇటీవల బయటపడిన అదానీ కుంభకోణంతోపాటు పలు అక్రమాలను ఆయుధాంగా ప్రయోగించాలని భావిస్తున్నారు. కవిత అరెస్టయితే, అది రాజకీయ కక్ష సాధింపు అని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ‘‘ప్రజలకు మతిమరుపు ఎక్కువ. అవినీతి ఎన్నికల్లో ముఖ్యవిషయమే కాదు. ఇవన్నీ మామూలే’’ ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు చెప్పాయి.