Mlc kavitha press meet on Delhi liquor scam
mictv telugu

మోదీ కంటే ముందు ఈడీ రావడం సహజమే.. ఎమ్మెల్సీ కవిత

December 1, 2022

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత సహ 36 మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అమిత్‌ అరోడా రిమాండ్‌ రిపోర్ట్‌లో చేర్చింది. ఆమెతో సహ తెలుగురాష్ట్రాలకు చెందిన శరత్‌రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్‌, సృజన్‌రెడ్డిలు ఉన్నారు. తనపై ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో మోదీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతోంది. ఈ ఎనిమిదేండ్లలో 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ విషయం అందరికీ తెలుసు. ఎన్నికల ముందు మోదీ కంటే ముందు ఈడీ ఆయా రాష్ట్రాలకు వెళ్లడాన్ని చూస్తున్నాం. వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో అసెంబ్లీలో ఎన్నికలు ఉన్నందున మోదీ కంటే ముందు ఈడీ ఇక్కడికి వచ్చింది. అది నార్మల్‌. నాపై కావొచ్చు.. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు హీనమైన ఎత్తుగడ. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి విచారణకైనా మేం సిద్ధం.

ఆయా ఏజెన్సీలు వచ్చి అడిగితే తప్పకుండా జవాబు ఇస్తాం. అంతేకానీ మీడియాలో లీకులు ఇచ్చి నేతలకు ఉన్న మంచి పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజలు తిప్పికొడతానే విషయాన్ని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పంథాని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు మనమేం చేస్తామో చెప్పుకొని గెలవాలి తప్ప.. ఈడీ, సీబీఐలను ప్రయోగించి కాదు. అత్యంత చైతన్యవంతమైన ప్రజలు ఉన్న తెలంగాణలో మీకు అది సాధ్యపడదు. కాదు కూడదు అని జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. ఏమౌతుంది. భయపడేదేముంది. జైలులో పెట్టి ఉరివేయరు కదా. ప్రజలు మా వెంట ఉన్నంతకాలం.. ప్రజల కోసం టీఆర్ఎస్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నంతకాలం ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ రాదు’’ అని కవిత వ్యాఖ్యానించారు.