మహిళా రిజర్వేషన్లపై గత ప్రభుత్వాలు తమ మాటను నిలబెట్టుకోలేదన్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గత 27 ఏళ్లుగా మహిళల బిల్లు కోసం చర్చ జరుగుతోందని, మహిళా రిజర్వేషన్ బిల్లు కోల్డ్ స్టోరీజీలో ఉందని కవిత పేర్కొన్నారు. అందుకే రేపు మహిళా రిజర్వేషన్లపై జంతర్ మంతర్లో దీక్ష చేపట్టామన్నారు కవిత. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ల బిల్లును మోదీ అమలు చేస్తామని 2014, 2019లో చెప్పారని గుర్తు చేశారు. కానీ ఆ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. ప్రభుత్వాలు మారినా మహిళా బిల్లుకు మోక్షం కలుగలేదన్నారు. మాకు ఈడీ నోటీసులు అందాయని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని కోరామన్నారు. 11న ఈడీని ఇంటికి రావాలని కోరినట్లు తెలిపారు కవిత. తెలంగాణ నేతలను ఈడీ కేసులతో వేధించడం బీజేపీకి అలవాటు అయ్యిందన్నారు. మోదీ వన్ నేషన్, వన్ ఫ్రెండ్ అనే కొత్త స్కీంను అదానీని ఉద్దేశించే తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. ఉద్యమం నుంచి వచ్చామని.. భయపడే ప్రసక్తే లేదన్నారు. మోదీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు చేయరని ప్రశ్నించారు. నిందితులతో కలిపి విచారణ చేయాల్సి వస్తే తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలన్నారు. ఈడీ విచారణను ఎదుర్కొంటామన్నారు.