MLC Kavitha Tweet on Bilkis Bano's Rapist Shares Stage With Gujarat's BJP MP, MLA
mictv telugu

స్టేజ్‌పై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో సమానంగా రేపిస్ట్

March 27, 2023

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో 11 మంది రేపిస్టులను గతేడాది ఆగష్టు 15 న విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా గుజరాత్ ఎన్నికలకు ముందు ఈ 11 మందిని విడుదల చేశారు. దీనిపై ఇప్పటికీ న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది. ఆ దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరగనుంది కూడా.
అయితే, దోషుల్లో ఒకరు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి వేదిక పంచుకోవడం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో జనాలు నోరెళ్లపపెడుతున్నారు. మార్చి 25న దహోడ్ జిల్లా కర్మాడీ గ్రామంలో నీటి సరఫరా పథకం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ జస్వంత్ సిన్హ్ భభోర్, అతడి సోదరుడు ఎమ్మెల్యే శైలేశ్ భభోర్‌లు హాజరయ్యారు. వారితో పాటు బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషి శైలేశ్ చిమ్నాలాల్ భట్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అయితే ఈ పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు. బిల్కిస్ బానో రేపిస్ట్ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో బహిరంగంగా వేదిక పంచుకున్నారని కవిత పేర్కొన్నారు. ఒకవైపు బాధితురాలు న్యాయం చేయాలని వేడుకుంటుంటే.. మరోవైపు మహిళలపై క్రూరమైన నేరాలకు పాల్పడేవారు సంబరాలు చేసుకుంటున్నారని.. సమాజంగా మనం ఏమైపోయామని కవిత ప్రశ్నించారు. భారతదేశం గమనిస్తోందని పేర్కొన్నారు.

బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేసి ఆమె కుటుంబంలోని ఏడుగురిని చంపినందుకు 2008లో 11 మందికి జీవిత ఖైదు విధించబడింది. అయితే గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున వారినివిడుదల చేయడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.