ఢిల్లీ లిక్కర్ కేసు రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా 36 మంది పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత స్పందించనున్నారు. కాసేపట్లో బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొన్న అంశాలు.. దానికి సంబంధించిన పరిణామాలపై ఆమె మాట్లాడనున్నారు. కవిత ప్రెస్‌మీట్ నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె ఇంటికి చేరుకుంటున్నారు.
మద్యం కేసులో అనుమానం ఉన్న 36 మంది పేర్లను అమిత్ అరోడా రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది. ఈ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆయనను ఈడీ మంగళవారం రాత్రి అరెస్టు చేసింది. బుధవారం ఢిల్లీ కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్ రిపోర్టు సమర్పించింది. లిక్కర్ స్కామ్ కేసులో రూ. వంద కోట్లు అరేంజ్ చేసినవారిలో.. కవిత, ఎంపీ మాగుంట పేరు ఉన్నట్టు ఈడీ తెలిపింది. కాగా, అమిత్ అరోరాను ఇప్పటికే అరెస్ట్ చేసి ఈడీ పలుమార్లు విచారించింది. ఈ క్రమంలోనే కవిత పేరు రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చడం హాట్ టాపిక్‌గా మారింది. లిక్కర్ స్కామ్ ఎపిసోడ్లో సౌత్ గ్రూప్ వంద కోట్ల ముడుపులు చెల్లించింది. గతంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ స్కామ్ తో సంబంధం లేనట్లు వెల్లడించారు. ఈ తరుణంలోనే వీరిద్దరి పేర్లను చేర్చడం రాజకీయాల్లో కలకలం రేపుతోంది.